
- ఎమ్మెల్యేపై నమోదైన కేసు విచారణ నిలిపివేతకు నిరాకరణ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. కేసు దర్యాప్తును ఆపాలని, అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని సుజాతకు నోటీసులు జారీ చేసింది. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సంబంధించి వివాదంలో భాగంగా సుధీర్‌రెడ్డి తనను దూషించారని ఎల్బీనగర్ పీఎస్‌లో సుజాత ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతో తనపై తప్పుడు కేసు పెట్టారంటూ సుధీర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. పిటిషనర్‌కు ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వకూడదని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యులేటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను నిలిపి వేయలేమని చెబుతూ, విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు.